Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య కొత్తగా ‘‘సర్ క్రీక్ ’’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచడంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈ సమస్యను భారత్ చర్చల ద్వారా చాలా సార్లు పరిష్కరించేందుకు ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం వేరేగా ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు.
అసలు ఏంటీ సర్ క్రీక్, ఎక్కడ ఉంది..?
భారత్ గుజరాత్ రాష్ట్రం, పాకిస్తాన్ సింధ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఉప్పునీటి చిత్తడి ప్రాంతాన్ని సర్ క్రీక్‌గా పిలుస్తారు. ఈ ప్రాంతంలోకి అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది.
రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన వివాదాల్లో ఇది ఒకటి. నిర్జన చిత్తడి ప్రాంతం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ నిల్వలు, అరేబియా సముద్రంలో సముద్ర సరిహద్దులు, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లను ప్రభావితం చేస్తుంది. 96 కి.మీ నదీముఖ ద్వారం, ఈ క్రీక్ అరేబియా సముద్రంలోకి చొచ్చుకువెళ్తుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దులు 1968 ట్రిబ్యునల్ అవార్డ్ స్పష్టంగా నిర్వచించింది.
వివాదం ఏంటి..?
1947 స్వాతంత్ర్యం తర్వాత సింధ్ పాకిస్తాన్‌లో భాగం కాగా, గుజరాత్ భారత్‌లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ ‘‘రాన్ ఆఫ్ కచ్’’ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్ క్రీక్ అనేక రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు. భారత్ ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే, పాక్ మాత్రం సర్ క్రీక్ వివాదాన్ని ముందుగా పరిష్కరించాలని పట్టుబడుతోంది.
పాకిస్తాన్ మొత్తం సర్ క్రీక్ సింధ్ ప్రాంతానికి చెందినదే అని వాదిస్తోంది. ఇది 1914 తీర్మానం సరిహద్దును తూర్పు ఒడ్డున ఉంచింది. అంటే దీని ప్రకారం, మొత్తం ఈ చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే, భారత్ మాత్రం 1914 బ్రిటీష్ అధికారులు ఈ ఒప్పందంలో ‘‘థాల్వెగ్ సూత్రాన్ని’’ వర్తింప చేసిందని ప్రస్తావిస్తోంది. దీని అర్థం క్రీక్‌లోని కాలువ మార్గంలో లోతైన ప్రాంతం నుంచి సరిహద్దును గీయాల్సి ఉంటుందని చెబుతోంది. అయితే, ఈ సూత్రాన్ని వర్తింపచేయడానికి ఇక్కడ నది లేదని పాకిస్తాన్ వాదిస్తోది. 1925 బ్రిటీష్ మ్యాప్ లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నాయి. ఇది భారత్ వాదనని సమర్థి్స్తోంది.
ఆర్థికంగా చాలా ప్రాముఖ్యం:
సర్ క్రీక్ ఇరు దేశాలకు వ్యూహాత్మక సైనిక విలువను కలిగి ఉంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంపై నియంత్రణ సముద్ర సరిహద్దులు, ప్రత్యేక ఆర్థిక మండలాల (EEZలు)కు కీలకం. ఈ వివాదం తరుచుగా స్థానిక మత్స్యకారుల్ని ప్రభావితం చేస్తోంది. వారు తమకు తెలియకుండా దేశాల సరిహద్దుల్ని దాటుతున్నారు. దీంతో నెలల పాటు జైళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక ఎందుకు..?
గుజరాత్ భుజ్‌లో దసరా పండగ సందర్భంగా ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సర్ క్రీక్ విషయంలో పాకిస్తాన్ దుర్మార్గపు ఉద్దేశాన్ని కలిగి ఉందని ఆరోపించారు. సర్ క్రీక్‌కు అనుకుని ఉన్న ప్రదేశాల్లో పాకిస్తాన్ సైనిక సదుపాయాలను విస్తరిస్తోంది. కొత్త బెటాలియన్లు, తీర ప్రాంత రక్షణ పడవలు, మెరైన్ అసాల్ట్ క్రాఫ్ట్‌లను మోహరించింది. రాడార్లు, క్షిపణులు, నిఘా విమానాలతో వైమానిక రక్షణను బలోపేతం చేసింది.
ఈ నేపథ్యంలోనే రాజ్‌నాథ్ హెచ్చరిక వచ్చింది. 1965 యుద్ధంలో భారత్ సైన్యం లాహోర్‌ని చేరుకుందని, 2025లో పాకిస్తానీలు దుశ్చర్యకు పాల్పడితే, కరాచీకి వెళ్లే ఒక మార్గం ఈ క్రీక్ గుండా వెళ్తుందని గుర్తుంచుకోవాలని అని హెచ్చరించారు.