రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్ బొమ్మై సీఎం కావడానికి కోట్ల రూపాయలు చెల్లించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఢిల్లీకి చెందిన పవర్ బ్రోకర్లు కొందరు తనను సీఎం పదవి కోసం సంప్రదించారంటూ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కలకలం రేపాయని సిద్ధరామయ్య ఆరోపించారు. బీజేపీలో ఇప్పటివరకు పార్టీ అధిష్టానమే సీఎంను ఎన్నుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అయితే సీఎం సీటు వేలం ద్వారా అమ్ముతారని యత్నాల్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని ఆయన విమర్శలు చేశారు. బీజేపీ గత సీఎంలు కూడా సీఎం పదవి కోసం ఎంత మొత్తం ఖర్చు చేశారో చెప్పాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. సీఎం పదవితో పాటు మంత్రి పదవులు, ఇతర పదవులు కూడా బీజేపీ వేలం వేసి అమ్ముతున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.