DK Shivakumar: వరస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక సంక్షోభం కొత్త తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం అనే ఒప్పందం ప్రకారం, తనకు అవకాశం ఇవ్వాలని డీకే కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2004లో యూపీఏ ఘన విజయం సాధించిన తర్వాత, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని శుక్రవారం ఆయన అన్నారు.
Read Also: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం రేసులోకి కొత్త పేరు..
‘‘సోనియా గాంధీ 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ నుంచి ఈ దేశానికి నాయకురాలిగా ఉన్నారు. ఆమె అధికారాన్ని త్యాగం చేశారు. ఆ రోజుల్లో (2004లో) అబ్దుల్ కలాం కూడా సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకున్నారు. కానీ ఆమె అధికారాన్ని త్యాగం చేసి, మన్మోహన్ సింగ్ పేరును అత్యున్నత పదవికి ప్రతిపాదించారు’’ అని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక నాయకత్వ మార్పుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అంగన్వాడీ కార్యక్రమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఇదే సమయంలో, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. మీ ఆశీస్సులు తమపై ఉండాలని, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ ఆశీస్సులు ఉండాలని డీకే కోరడం విశేషం. కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలను పక్కన పెట్టి, అంతా ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చేందుకు డీకే ఇలా మాట్లాడారని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.