Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్‌కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల కన్నా దేశం ముఖ్యమని చెప్పారు. ఎవరికైనా దేశం ముందు ఉంటుందని, పార్టీలు కేవలం దేశాన్ని నిర్మించే సాధానాలు మాత్రమే అని చెప్పారు.
Read Also: Sajjala: చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం.. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం!
‘‘ముందుగా మీ విధేయత ఏమిటి..? నా దృష్టిలో దేశం ముందు వస్తుంది. పార్టీలు దేశాన్ని మెరుగుపరిచే సాధనం. కాబట్టి నా దృష్టిలో ఏ పార్టీకి చెందిన వారైనా దేశానికి మొదటి ప్రాధాన్యత. ’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ రక్షణకు సంబంధించిన విషయాలపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వానికి శశిథరూర్ మద్దతు పలకడంపై కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘నేను తీసుకున్న వైఖరి మన సాయుధ దళాలు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం. ఇటీవల మన దేశంలో, మన సరిహద్దుల్లో జరిగిన దాని కారణంగా చాలా మంది నన్ను తీవ్రంగా విమర్శించారు. కానీ నేను నా వైఖరిలో నిలబడతాను, ఎందుకంటే ఇది దేశానికి సరైన విషయం అని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా కొన్నిసార్లు ఇతర పార్టీలకు సహకరించాలి, అయితే కొన్నిసార్లు పార్టీలు దీనిని నమ్మకద్రోహంగా భావిస్తాయని, అది పెద్ద సమస్య అవుతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో తప్పనిసరిగా పోటీ ఉంటుందని, కానీ క్లిష్ట సమయాల్లో కలిసి పనిచేయడానికి అవి అడ్డురాకూడదని చెప్పారు.
