Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ తిరుగుబాటుపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇది కొత్త కాదని, 1980లో పార్టీ పెట్టిన సమయంలో 58 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు 6 మంది మిగిలారని.. అయినా కూడా తాను పార్టీని బలపరిచానని అన్నారు. పార్టీ మారిన వారంత తర్వాత ఓడిపోయారని గుర్తు చేశారు. మళ్లీ పార్టీని బలోపేతం చేస్తానని, తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని శరద్ పవార్ అన్నారు.
పార్టీ అధ్యక్షుడిగా నేను ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కీలక బాధ్యతలు అప్పటించినా, వారు ఆ బాధ్యతనలను నిర్వర్తించలేదని..అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. మా ప్రధాన బలం సామన్య ప్రజలే అని.. రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితిని గమనించి కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేలతో కలిసి చర్చిస్తానని అన్నారు. ఇప్పటికే తనకు చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డబ్ల్యూబీ సీఎం మమతా బెనర్జీ తదితరులు నాకు ఫోన్ చేశారని చెప్పారు. ఈ రోజు జరిగిన దానికి చింతించడం లేదని అన్నారు.
రేపు వైబీ చవాన్(మహారాష్టర మాజీ సీఎం) ఆశీర్వాదం తీసుకుని, బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్సీపీ నేతల్లో కొందరు మంత్రులగా ప్రమాణం చేసినందుకు సంతోషిస్తున్నానని.. అయితే రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ ఎన్సీపీ గురించి మాట్లాడుతూ.. ఎన్సీపీ ఫినిష్ పార్టీ అని చెప్పారని శరద్ పవార్ గుర్తు చేశారు. ఆయన ఎన్సీపీపై అవినీతి ఆరోపణలు చేశారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇకపై ఆ ఆరోపణలు క్లియర్ అవుతుందని స్పష్టమవుతోందని.. ఆయనకు కృతజ్ఞతలు అంటూ ప్రధానిపై సెటైర్లు వేశారు.