మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ నుంచి చాలా మంది ఎంపీలు, ముఖ్యంగా NCP (SP) పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు మహాయుతి వైపు చూస్తు్న్నారని బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ బుధవారం వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొంత మంది ఎంపీలు టచ్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే చేరికలు ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?
అభివృద్ధి కోసం, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారడం సహజమేనని ప్రవీణ్ దారేకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇదిలా ఉంటే దారేకర్ వ్యాఖ్యలను ఎన్‌సీపీ (ఎస్‌పీ) నాయకుడు విద్యా చవాన్ తోసిపుచ్చారు. మిత్రపక్షాల మద్దతు కోల్పోయే భయంతో బీజేపీ.. ప్రతిపక్ష నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో నడుస్తోందని.. వారు మద్దతు ఉపసంహరించుకుంటారేమోనన్న భయంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు గాలం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఎలాంటి ప్రలోభాలకు గురికారని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు దృఢంగా ఉన్నారని, సంకీర్ణానికి ద్రోహం చేయరని విద్యా చవాన్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 235 స్థానాలు గెలుచుకుంది. మహా వికాస్ అఘాడీ కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. ముఖ్యమంత్రి స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..