Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను మార్చి 2న లంచ్‌కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
Read Also: Space: అంతరిక్షంలో తప్పిన రెండు శాటిలైట్ ప్రమాదాలు.. ఊపిరిపీల్చుకున్న సైంటిస్టులు
ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చిన అజిత్ పవార్‌ని కూడా ఆహ్వానించారు. ముగ్గురు కూడా పూణే జిల్లా బారామతి పట్టణంలోని విద్యా ప్రతిష్ఠాన్ కళాశాల ప్రాంగణంలో జరిగే జాబ్ మేళా ‘నమో మహరోజ్‌గర్ మేళవా’కు హాజరు కానున్నారని తెలుస్తోంది. శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చాడు. మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల సంఘం, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని తీర్పు చెప్పాయి.
మరోవైపు, బారామతి లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం శరద్ పవార్ కుమార్తె సుప్రియాసూలే ఎంపీగా ఉన్నారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ తన భార్యను బారామతిలో ఆమెకు ప్రత్యర్థిగా దింపబోతున్నారు. ఇప్పటికే అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలా శరద్ పవార్ లంచ్ ఆహ్వానం పంపడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రతిపక్ష ఎన్సీపీ(శరద్ పవార్)-కాంగ్రెస్- శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో శరద్ పవార్ భాగంగా ఉన్నారు. ఇండియా కూటమిలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.