Swami Avimukteshwaranand: రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. హిందువులను జాగృతం చేయడం చిన్న విషయం కాదని, అది ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇతనే కొన్ని రోజుల క్రితం రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
ప్రధాని మోడీ హిందువుల ఆత్మగౌరవం గురించి తెలుసుకున్నందున తాను ప్రధాని నరేంద్రమోడీని ఆరాధించేవారిలో ఒకరినని శంకరాచార్య అన్నారు. మేం మోడి వ్యతిరేకుల కాదని, ఆరాధకులమని, మేము చాలా సార్లు ఇదే విషయాన్ని చెప్పామని గుర్తు చేశారు. మోడీకి ముందు హిందువులను ఇంతగా ఐక్యం చేసిన ప్రధాని ఎవరూ లేరని ఆయన అన్నారు. మనకు చాలా మంది ప్రధానులు ఉన్నారు, వారంతా మంచి వారని, మేం వారిని విమర్శించడం లేదని శంకరాచార్య అన్నారు. ప్రధాని మోదీలా హిందువులను మేల్కొల్పినట్లు మరే ప్రధాని లేరని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రశంసలు కురిపించారు.
Read Also: Mahashakti Temple : రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. ముస్తాబైన కరీంనగర్ మహా శక్తి ఆలయం
ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు, పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు మేం స్వాగతించామని, మోడీ స్వచ్ఛతా అభియాన్ మేము అడ్డుకున్నామా..? అని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగనందుకు ప్రశంసించాము, హిందువులు బలపడినప్పుడల్లా మేము సంతోషంగా ఉన్నామని, ప్రధాని మోడీ ఆ పనిని చేస్తున్నారని శంకరాచార్య అన్నారు.
రేపు జరగబోయే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు నలుగురు శంకరాచార్యులు రావడం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. భగవంతుడి దేహంగా ఆలయం భావించబడుతుందని, అది అసంపూర్తిగా ఉందని, అందువల్ల కొత్త విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయడం సరికాదని స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు.