Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఢిల్లీలో వరసగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
Read Also: Maharashtra : దారుణం.. భర్తను బందించి మహిళపై సామూహిక అత్యాచారం..
ఢిల్లీలో ఓ ఫ్లాట్ సీలింగ్ కూలి 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. రాజస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్, జలోర్, పాలి, అజ్మీర్, అల్వార్, బన్స్వారా, భరత్‌పూర్, భిల్వారా, బుండి, చిత్తోర్‌గఢ్, దౌసా, ధౌల్‌పూర్, జైపూర్, కోట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అమర్ నాథ్ యాత్ర వరసగా మూడో రోజు నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే దక్షిణాదిన కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేరళలో వర్షాల వల్ల ఇప్పటి వరకు 19 మంది మరణించారని, 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.