New Parliament Inauguration: అట్టహాసంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన పూజలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు స్పీకర్ ఓంబిర్లా కూర్చున్నారు. ఆ తరువాత అధీనం పూజారుల నుంచి రాజదండం(సెంగోల్)కి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తరువాత దాన్ని స్వీకరించి లోక్ సభ స్పీకర్ పోడియం పక్కన ప్రతిష్టాపించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య సెంగోల్ ను లోక్‌సభ ఛాంబర్‌లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దాన్ని ప్రతిష్టించారు. పార్లమెంట్ నిర్మించిన కార్మికులను సత్కరించారు.
Read Also: New Parliament Building : కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ దృశ్యాలు
సర్వమత ప్రార్థలన మధ్య పార్లమెంట్ ని ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసి శిలా ఫలకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. కొత్త పార్లమెంట్ ను దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, జితేంద్ర సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సెంగోల్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చోళ యుగం నాటి సంప్రదాయాన్ని భారత ప్రభుత్వం పాటించింది. 1947లో బ్రిటీష్ వారి నుంచి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అధికార బదిలీ సమయంలో ఈ సెంగోల్ ను వాడారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు చెలరేగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, జేడీయూ, ఆప్, టీఎంసీ, ఎస్పీ, వామపక్షాలు మొత్తం 20 ప్రతిపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి.