Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు.
ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, రాఫెల్ జెట్స్‌కి అమర్చిన హామర్ ప్రెసిషన్-గైడెడ్ ఆయుధాలను ఎంచుకుంది. వీటితో పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టించింది. ఈ రెండు క్షిపణులను ఉపయోగించి, నిర్ధిష్ట ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసింది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా ఉండేందుకు వీటిని వాడారు.
స్కాల్ప్/ స్టార్మ్ షాడో:
స్టార్మ్ షాడో అని పిలువబడే స్కాల్ప్ క్షిపని, లాంగ్ రేంజ్ లోతైన దాడుల కోసం రూపొందించారు. దీనికి స్టెల్త్ లక్షణాల ఉంటాయి. అంటే శత్రువు రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలదు. ఇది ఎయిర్ నుంచి ప్రయోగించగలిగే క్రూయిజ్ మిస్సైల్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వీటిని వాడుతున్నాయి. రాత్రి పూట, అన్ని వాతావరణ సమయాల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 450 కి.మీ రేంజ్ కలిగిన స్కాల్ప్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. దీనిలో అధునాతన నేవిగేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఐఎన్ఎస్, జీపీఎస్, భూతలం నుంచి వచ్చే సూచనల ద్వారా పనిచేస్తుంది. దీనిని యూరోపియన్ కన్సార్టియం అయిన MBDA తయారు చేసింది.
బంకర్లు, మందుగుండు సామాగ్రిలోకి చొచ్చుకుపోగలదు. రష్యాలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉక్రెయిన్ వీటిని వాడుతోంది. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, క్షిపణిలోని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ టార్గెట్‌ని గుర్తించి, దానిలోకి చొచ్చుకుపోతుంది. 450 కిలోల బరువున్న వార్ హెడ్‌ని ఇది మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని గుర్తించడం శత్రువులకు చాలా కష్టం.
హామర్:
ఆపరేషన్ సింధూర్ కోసం ఉపయోగించిన మరో ఆయుధం హామర్ (హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్), అన్ని వాతావరణాలలో ఉపయోగించగల ఎయిర్ టూ సర్ఫేజ్‌కి ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ బాంబు. దీనిని గ్లైడ్ బాంబ్‌గా పిలుస్తారు. ఇది 70 కి.మీ పరిధి కలిగి ఉంటుంది. దీనికి 250, 500, 1000 కిలోల బాంబుల్ని అమర్చవచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ దీనిని తయారు చేసింది.
కఠినమైన భూభాగంపై తక్కువ ఎత్తు నుండి ప్రయోగించబడుతుంది. దీనిని అడ్డగించడం కష్టం. బలమైన భవనాల గుండా చొచ్చుకుపోతుంది. జైషే మహ్మద్, లష్కర్ కార్యాలయాలను దీనితోనే భారత్ నాశనం చేసిందింది.
