Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలు నష్టపోయిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
Read Also:Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్, కోర్టు దీనిని పరిశీలిస్తుందని.. అత్యవసర విచారణ కోసం జాబితా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ కేసులో పరస్పర విరుద్ధమైన తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తామని సీజేఐ అన్నారు.
2022 అక్టోబర్ తీర్పులో.. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఓ న్యాయమూర్తి చెప్పగా, మరొకరు హిజాబ్ అనేది ముస్లిం మహిళల హక్కు అని పేర్కొన్నాడు. అంతకుముందు కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిజాబ్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు నడిచాయి. దీంతో ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. గతేడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, పాఠశాల్లో హిజాబ్ బ్యాన్ సక్రమే అని తీర్పు చెప్పింది. దీంతో పలువురు ముస్లిం విద్యార్థినులు, హక్కుల సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.