PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
Read Also: Dubai: భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన గల్ఫ్ కంట్రీ..
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు మాత్రమే తన కాశీ ప్రజల్ని తాగుబోతులు అంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ ‘షాహీ పరివార్’, ‘యువరాజ్’ వారణాసి ప్రజల్ని తమ సొంతగడ్డపై అవమానించారని అన్నారు. ‘‘ ఇదేం భాష.. రెండు దశాబ్ధాలుగా మోడీని తిడుతూనే ఉన్నారని, ఇప్పుడు యూపీ యువతపై తమ నైరాశ్యాన్ని బయటపెడుతున్నారని ’’మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ యువకుల పట్ల ఇండియా కూటమి చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేదనని ఆయన అన్నారు. ఇది వారి వాస్తవిక పరిస్థితి అని.. యువత ప్రతిభకు వారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాశీ, అయోధ్య కొత్త రూపాన్ని ఇండియా కూటమి నాయకులు చూడలేకపోతున్నారని ప్రధాని అన్నారు. పరివార్‌వాద రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపుల వల్ల దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు కలిసి వస్తారని, చివకు ఫలితం శూన్యమని, మళ్లీ వారు విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటారని విమర్శించారు. ఈ సారి మొత్తం దేశం మూడ్ మోడీ హామీకి అనుకూలంగా ఉందని, యూపీలో అన్ని సీట్లు ఎన్డీయేకే వస్తాయని ఆయన అన్నారు.