మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే స్థితికి వచ్చాయి. దీంతో కూటమి విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన (యూబీటీ) నేత చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ సమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Allu Arjun: కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే తాజాగా ఇండియా కూటమి బాధత్యలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. 100 శాతం మమతనే న్యాయం చేయగలరంటూ ఎస్పీ నేత ఉదయవీర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఆర్జేడీ కూడా తామేమీ తక్కువ కాదంటూ.. లాలూ ప్రసాద్ యాదవ్ అయితేనే న్యాయం చేయగలరని.. ఆయనే నిజమైన ఆర్కిటెక్ట్ అని ఆర్జేడీ పేర్కొంది. ఇంకోవైపు ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇలా కూటమిలో భిన్న స్వరాలతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Sukumar: ఆ విమర్శలకు సుక్కూ క్లారిటీ!
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో మిత్రపక్షాలకు చోటు కల్పించకపోవడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు చోటు కల్పించలేదని విమర్శించారు. కూటమి భాగస్వాముల మాట విని ఉంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా కలిసి కట్టుగా ముందుకు వెళ్తారా? లేదంటే ఎవరిదారి వారు చూసుకుంటారో చూడాలి. ఇప్పటికే అపజయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరిదారి వారు చూసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవేమోనని వినికిడి.
ఇది కూడా చదవండి: Maharashtra: మహా వికాస్ అఘాడీలో లుకలుకలు.. కూటమి నుంచి వైదొలిగిన ఎస్పీ