INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు దాని మిత్రపక్షాలు కూడా ఘోర పరాజయాలను మూటకట్టుకున్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంతా కాంగ్రెస్‌దే అనుకున్నారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. వారి ఓవర్ కాన్ఫిడెన్స్ వారిని ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ మూడోసారి ఘన విజయం సాధించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే, మేజర్ పార్ట్‌నర్‌గా ఉన్న కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 233 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ 100కి పైగా స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 స్థానాలకు మాత్రమే సంపాదించింది. ఇక జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, అది పూర్తిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), సీఎం హేమంత్ సొరెన్ ఖతాల్లో పడిపోయింది. కాంగ్రెస్ సొంత బలం కన్నా జేఎంఎం బలంలోనే గెలిచిందనేది సత్యం. ఎన్నికల్లో మేజర్ పార్టీగా ఉండీ, దానికి తగ్గట్లుగా ఫలితాలు ఉండకపోవడంపై ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నాయి.
ఇండియా కూటమిలో బీటలు..
ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పనితనంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరుగా మిత్రపక్షాలు ‘హ్యాండ్’ ఇస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వాన్ని మమతా బెనర్జీ తీసుకోవాలనే ఒక వాదన వినిపిస్తోంది. ఇందుకు తాను సిద్ధమని ఆమె ఇప్పటికే ప్రకటించింది. సమాజ్‌వాదీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ, ఎన్సీపీ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇలా ప్రతీ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలను వ్యతిరేకిస్తూనే ఉంది.
పార్టీల అభిప్రాయాలు ఏంటి..?
ఆర్జేడీ:
తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ కూడా ఇండియా కూటమిలో తన అభిప్రాయాన్ని చెప్పింది. కూటమిని నడిపించే చొరవ లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఉందని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. ఇండియా కూటమి రూపశిల్పి లాలూ అని చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీ:
సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. ఇండియా కూటమిని నడిపించే సమర్థవంతమైన వ్యక్తి మమతా బెనర్జీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
సీపీఐ:
కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మాట విని ఉంటే, ఈ రోజు వేరే ఫలితాలు వచ్చేవని చెప్పారు.
ఎన్సీపీ శరద్ పవార్:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనపై సుప్రియా సూలే మాట్లాడారు. మమతా బెనర్జీ ఇండియా కూటమిలో అంతర్భాగం. ఆమె దేశంలో గొప్ప నాయకురాలు. ఆమె నాయకత్వం వహించాలనునకుంటే వారికి మద్దతు ఇస్తాం.
శివసేన-ఠాక్రే:
మమతా అభిప్రాయం మాకు తెలుసు. ఆమె కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలని మేము కోరుకుంటున్నాము. త్వరలో ఆమెని కలవడానికి కోల్‌కతా వెళ్తామని సంజయ్ రౌత్ చెప్పారు.
ఆప్:
ఆప్ ఇప్పటికే కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండడని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఏం చెబుతోంది..?
కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మమతా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. నాయకత్వం అనేది కూటమి ద్వారా నిర్ణయించబడుతుంది. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోబడుతుంది. ఏ ఒక్క పార్టీ నిర్ణయం కాదు. కూటమిలో 17-18 పార్టీలు ఉన్నాయి. ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకుంటారు.