సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు. మకర జ్యోతి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. చుట్టు పక్కల అడవుల్లో ఉన్న భక్తులు కూడా దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ స్వామియే శరణం అయ్యప్పా అంటూ నామస్మరణతో మార్మోగుతోంది.
లక్షలాది మంది భక్తులు పొన్నంబలమేడులో మకర జ్యోతిని చూసేందుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితమే కొండపైకి భక్తులు వచ్చారు. కొండపై 1.5లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని మంగళవారం అధికారులు అంచనా వేశారు. సోమవారమే 64, 194 మంది భక్తులు కొండపైకి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా చుట్టు పక్కల కొండలపైన కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇదిలా ఉంటే మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.