RSS: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘కుల గణన’ అంశం ప్రముఖంగా నిలిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కులగణనకు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ (ప్రధాన ప్రతినిధి) సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. ‘‘కులాల డేటా పూర్తి చేయాలి. కులాలు మన సమజాంతో సున్నితమైన సమస్య అవి జాతీయ సమైక్యతకు ముఖ్యమైనవి’’ అని అన్నారు.
కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజుల సమావేశాల అనంతరం అంబేకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, కుల గణనను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించరాదని చెప్పారు. విధాన రూపకల్పనకు మరియు అట్టడుగు వర్గాలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు ఇది చాలా అవసరమని పేర్కొంటూ సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అన్నారు.
Read Also: CM Revanth Reddy: వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలి.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ
గతేడాది డిసెంబర్‌లోనే కుల గణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. దేశవ్యాప్తం కుల గణన నిర్వహించడానికి తాము వ్యతిరేకం కాదని చెప్పింది. ‘‘ఇటీవల, కుల గణన గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఇది సమాజం యొక్క సర్వతోముఖ ప్రగతికి ఉపయోగించబడాలని మేము విశ్వసిస్తున్నాము మరియు అలా చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యం మరియు సమగ్రతకు భంగం కలగకుండా అన్ని వైపులా చూసుకోవాలి’’ అని అంబేకర్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్‌కి చెందిన మరో నేత శ్రీధర్ గాడ్గే కులగణన అనేది నిర్ధిష్టమైన వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడే వ్యర్థమైన పని అని పేర్కొనడం ఇటీవల వివాదాస్పదమైంది. ఇది కులాల వారీగా జనాభాను గణిస్తుంది, కానీ అది సమాజం లేదా దేశం ప్రయోజనాలకు సంబంధించినది కాదు అని చెప్పారు.