RSS was banned 3 times in the past: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఎన్ఐఏ విచారణలో తేలింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ అతివాద సంస్థ ఆర్ఎస్ఎస్ అని దాన్ని కూడా పీఎఫ్ఐ లాగే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది నాయకులు.
అయితే ఇప్పటి వరకు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఆ తరువాత నిషేధాన్ని ఎత్తేశారు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చేత ఆర్ఎస్ఎస్ ప్రారంభం అయింది. ప్రస్తుతం బీజేపీకి సైద్ధాంతిక సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ పై పలు ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించడంతో పాటు, మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. 1948, 1975, 1992లో మూడుసార్లు ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది. మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే 1948లో హత్య చేసిన తర్వాత అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ తొలిసారిగా నిషేధాన్ని విధించారు. దాదాపుగా 18 నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తేశారు.
Read Also: Fighter jets escort Air plane: విమానంలో బాంబు కలకలం.. ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో ల్యాండింగ్
దీని తర్వాత ఇందిరా గాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించడంతో మరోసారి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను తగ్గించేందుకు మరోసారి నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. ఆ తరువాత 1992లో మూడోసారి నిషేధాన్ని ఎదుర్కొంది. పీవీ నరసింహా రావు హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేయడంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో ప్రధాని పీవీ నరసింహరావు, హోం మంత్రి శంకర్ రావు బల్వంతరావు చవాన్ నిషేధాన్ని విధించారు.
ఇదిలా ఉంటే 1965 భారత్-పాక్ యుద్ధం, 1962 ఇండో చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించారు. 1963 రిపబ్లిక్ డే పరేడ్ తో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ ను కూడా ఆహ్వానించారు. 1992 బాబ్రీ మసీదు కూలిపోవడానికి ముందు పీవీ నరసింహరావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతకవైఖరి అవలంభించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.