Supreme Court: నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు క్యాంటీన్‌లో మాంసాహారాన్ని అనుమతించడంపై వివాదం మొదలైంది. క్యాంటీన్‌లో మాంసాహారాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల బృందం కోర్టు బార్ అసోసియేషన్, ఇతర న్యాయ సంఘాలను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టులో పెద్ద దుమారానికి కారణమైంది.
హిందువులకు పవిత్రమైన నవరాత్రుల్లో, తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాల్లో కొలుస్తారు. ఈ నవరాత్రుల సమయంలో హిందువుల్లో చాలా మంది మాంసాహారాన్ని తినరు. అయితే, నవరాత్రి ఉత్సవాల సమయంలో మాంసాహారాన్ని పున:ప్రారంభించాలనే నిర్ణయంపై సీనియర్ న్యాయవాది రజత్ నాయర్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) మరియు సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA)కి లేఖ రాశారు. ఇతర బార్ సభ్యుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, మళ్లీ నాన్ వెజ్‌ని క్యాంటిన్‌లో ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం బార్ కౌన్సిల్ యొక్క ‘‘బహుళవాద సంప్రదాయాల’’తో ఏకీభవించలేదని, ఇది అసహనం, ఒకరినొకరు గౌరవించుకోకపోవడాన్ని చూపించిందని లేఖలో పేర్కొన్నారు. నాయర్ రాసిన లేఖలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న 133 మంది న్యాయవాదులు సమర్థించారు.
Read Also: Kolkata Doctor Case: ట్రైనీ వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్ .. కీలక విషయం వెల్లడి..
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముందుగా క్యాంటీన్‌లో మాంసాహారాన్ని నిషేధించారు. అయితే దీనికి వ్యతిరేకంగా మరొక వర్గం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ క్యాంటీన్‌లో నాన్-వెజ్ ఫుడ్‌ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన తర్వాత మరికొందరు న్యాయవాదులు నుంచి వ్యతిరేకత వచ్చింది. అక్టోబర్ 1వ తేదీన మంగళవారం, న్యాయవాదులు నిరసన తెలిపిన తర్వాత సుప్రీంకోర్టు క్యాంటీన్‌లో మాంసాహారం వడ్డించడానికి అనుమతి వచ్చింది.
శాఖాహార ఆహారం మాత్రమే ఇవ్వడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్బీబీఏ) అధ్యక్షుడు కపిల్ సిబల్ లేఖ రాశారు. నవరాత్రి సమయంలో మాంసాహారాన్ని నిషేధించే నిర్ణయం తప్పుడు సంకేతాలను ఇస్తుందని అన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా సుప్రీంకోర్టు నవరాత్రి సమయంలో శాఖాహారాన్ని మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ఇది అపూర్వమైది మాత్రమే కాదు, చాలా తప్పుడు సంకేతాలను ఇస్తుంది అని లేఖలో పేర్కొన్నారు.