బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోగా.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు కుమ్మరించారు. తాజాగా ఆ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది. యువతే లక్ష్యంగా తేజస్వి యాదవ్ అతి పెద్ద సంచలన హామీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: IAF: “రావల్పిండి చికెన్ టిక్కా, బలవల్పూర్ నాన్”.. డిన్నర్ మెనూతో పాకిస్తాన్ పరువు పోయిందిగా..
తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి రాగానే అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని అతి పెద్ద హామీ ప్రకటించారు. తన వాగ్దానానికి ఎలాంటి ఢోకా లేదని.. డేటా ఆధారంగానే ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదేనని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు అందుకు వీలుగా చట్టం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బీహార్‌లో ఉద్యోగం లేని ఇల్లు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
20 ఏళ్లుగా బీహార్ నిరుద్యోగ సమస్యతో కొట్టిమిట్టాడుతోందని విమర్శించారు. బీహార్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమ దగ్గర ప్రణాళిక ఉందని తెలిపారు. ఎన్డీఏ భాగస్వాములైన జేడీయూ, బీజేపీలు ఉద్యోగ హామీ ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతిని ఇస్తామని చెబుతున్నాయన్నారు. కానీ విపక్ష కూటమి అధికారంలోకి రాగానే 20 రోజుల్లోపు ఉద్యోగాల కోసం చట్టాన్ని తీసుకువస్తామని వివరించారు. ఇక 20 నెలల్లోపు ప్రభుత్వ ఉద్యోగం లేని బీహార్ ఇల్లు లేకుండా చేయడమే తమ సంకల్పం అని పేర్కొన్నారు. ‘ఇది నా ప్రతిజ్ఞ.. జుమ్లేబాజీ కాదు’ అని తెలిపారు.
బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని.. సామాజిక న్యాయంతో పాటు బీహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం కూడా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమే.. దీనికి సంకల్ప శక్తి అవసరం అని చెప్పారు. మా హామీలను ఎన్డీఏ కూటమి కాపీ కొడుతోందని విమర్శించారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.