Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉందని, హైకోర్టు రాజ్యాంగ న్యాయస్థానం అయినందున, దంపతుల రాజ్యాంగ హక్కులను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం చెరగనిదని, రక్షించబడినదని, ఇది ఏ విధంగా పలుచన చేయబడదని కోర్టు పేర్కొంది.
Read Also: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
పిటిషనర్ల వివాహం వాస్తవం, వారు మేజర్ అనేది వాస్తవం, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని, అలాంటి సంబంధాన్ని కుటుంబ సభ్యులు అభ్యంతర చెప్పలేరని న్యాయస్థానం విచారణలో పేర్కొంది. తమ తల్లిదండ్రులను ఎదురించి ఏప్రిల్ లో వివాహం చేసుకున్నామని, అప్పటి నుంచి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు, ముఖ్యంగా అమ్మాయి తల్లి నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఓ జంట కోర్టు మెట్లెక్కింది. వీరికి తగిన రక్షణ కల్పించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఎప్పటికప్పుడు ఓ బీట్ అధికారి వీరిని తనిఖీ చేయాలని కోరింది. ఒక వేళ జంట తాముంటున్న నివాసం నుంచి వేరే ప్రాంతానికి మారినట్లయితే, ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హచ్ఓకి తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.