26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
‘‘ భారత ప్రభుత్వం తమను నిషేధించమని కోరనప్పటికీ.. ఇజ్రాయిల్ అధికారికంగా అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది. లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థల జాబితాలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి’’ అని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘ లష్కరే తోయిబా ఒక ఘోరమైన, ఖండించదగిన ఉగ్రవాద సంస్థ, ఇది వందలాది మంది భారతీయులు పౌరులతో పాటు ఇతరుల హత్యలకు కారణమైంది. నవంబర్ 26, 2008న లష్కరే హేయమైన చర్యలు ఇప్పటికీ శాంతి కోరుకునే దేశాలు, సమాజాల ద్వారా ప్రతిధ్వనిస్తున్నాయి’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Also: WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్ ఫిల్టరింగ్ ఫీచర్ బెనిఫిట్స్ ఇవే..!
ముంబై దాడుల్లో అనేక మంది విదేశీ పౌరులతో పాటు 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు ముంబై తీరానికి చేరుకుని నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ప్రముఖ లియోపోల్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు మరియు ఒక థియేటర్‌తో సహా వివిధ ప్రదేశాలలో పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. నారీమన్ హౌజ్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటళ్లలో వేలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు యూదులు ఉన్నారు. వీరంతా నారిమన్ హౌస్ లో హత్యకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇండియాలో ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ మాట్లాడుతూ.. భారత్ హమాస్‌ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని కోరారు.