Assam Coal Mine: అస్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం నాడు తవ్వకాలు కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 100 అడుగుల మేర నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకొన్నారు. అయితే, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈక్రమంలో తాజాగా మరో మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్ల సహాయంతో గని లోపల నీటిమట్టం 100 అడుగుల మేర ఉన్నట్లు అంచనా వేశారు.
Read Also: Gold Rate Today: పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
ఇక, విశాఖ తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్లు ఇప్పటికే రెస్య్కూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే, గనిలోని నీటిని తోడేందుకు డీ వాటరింగ్ పైపులను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, 340 అడుగుల లోతు ఉన్న గనిలో చిక్కుకున్నవారిలో ఒకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి, మరొకరు పశ్చిమ బెంగాల్ వాసి కాగా.. మిగిలిన వారందరూ అస్సాం రాష్ట్రానికి చెందిన వారే. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. 2019లో మేఘాలయలో కూడా ఇలాంటి విపత్తే వచ్చింది. గనిలో కొందరు అక్రమంగా పని చేస్తున్న సమయంలో పక్కనున్న నది నుంచి భారీగా నీరు రావడంతో సుమారు 15 మంది జల సమాధి అయ్యారు.