Rates hiked for commercial cylinders and domestic gas cylinder cost remains: ఎవరైనా కొత్త సంవత్సరం రోజు శుభవార్త చెప్తారు. కానీ.. మన కేంద్ర ప్రభుత్వం మాత్రం చేదువార్త అందించింది. శుభమా అని కొత్త సంవత్సరంలోకి ఇలా అడుగుపెట్టామో లేదో, అప్పుడే కేంద్రం బాంబ్ పేల్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో బతుకుజీవుడా అంటూ జీవనం కొనసాగిస్తున్న సామాన్య ప్రజలపై మరో భారం మోపింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ తాజా పెంపు.. రెస్టారెంట్లు, ఇతర వాణిత్య సంస్థలపై ప్రభావం చూపనుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1768కి చేరింది. ముంబైలో రూ.1721కి పెరగ్గా.. కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి గరిష్టంగా చేరింది. అయితే.. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1105గా ఉంది. గతేడాది జనవరిలో సిలిండర్ ధర రూ. 952 ఉండగా, డిసెంబర్ నాటికి అది రూ. 1105కి చేరింది. మెట్రోపాలిటన్‌లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ – రూ. 1053, ముంబై – రూ. 1052.5, కోల్‌కతా – రూ. 1079, చెన్నై – రూ. 1068.5. కాగా.. ఇండియన్ ఆయిల్, ఇతర చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. ఈ క్రమంలోనే నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాయి.
కేవలం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పరిశీలిస్తే.. 2022 మొదట్లో రూ. 952గా ఉండేది. అయితే.. మార్చిలో రూ. 50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వెంటనే మే నెలలో రెండోసారి రూ. 50 పెంచేశాయి. అదే నెలలో మళ్లీ రూ. 3.50 ధర పెరిగింది. చివరిసారిగా జులై రూ. 50 పెరగడంతో.. ప్రస్తుతం దాని ధర రూ. 1105గా ఉంది.