రాజస్తాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో జరిగిన హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం, హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది వైరల్ కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయ్ పూర్ లో మల్దాస్ ప్రాంతంలో బిజీగా ఉండే మార్కెట్ లో తన షాప్ లో పని చేసుకుంటున్న కన్హయ్య కుమార్ ను రియాజ్ అక్తర్ పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో పాటు శిరచ్ఛేదానికి ప్రయత్నించారు. మరో నిందితుడు గౌస్ మహ్మద్ ఈ హత్యను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఘటనకు పాల్పడిన నిందితులను గంటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ హత్యతో రాజస్తాన్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజస్తాన్ లో మంగళవారం ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. నెల రోజుల పాటు ఈ సెక్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అన్ని జిల్లాల్లో , సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు పోలీసులు.
ఇదిలా ఉంటే ఘటనను జమియత్ ఉలామా- ఇ- హింద్ సంస్థ ఉదయ్ పూర్ హత్యను ఖండించింది. హత్య ఇస్లాం, దేశ చట్టాలకు వ్యతిరేఖమని సంస్థ కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మీ అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిని సమర్థించలేమని, ఇది ఇస్లాం మతానికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని.. దేశంలో శాంతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.