Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్‌గఢ్‌లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చోటా లాంబా గ్రామానికి చెందిన రైతు కనరామ్ జాట్ తన ఖాతాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లక్షల్లో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. దీంతో ఆనందంతో సదరు రైతు, పర్సనల్ లోన్ తీర్చేందుకు రూ. 15 లక్షలు వాడుకున్నాడు.
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి పంట బీమా ప్రీమియంగా ఈ మొత్తాన్ని, పొరపాటున రైతు జాట్ ఖతాలోకి బదిలీ చేసినట్లు బ్యాంక్ కనుగొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజన్ జితేంద్ర ఠాకూర్ మంగళవారం సాయంత్రం అరణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రైతు ఖాతాలోకి డబ్బులు చేరాయి. జనవరి 2 నుంచి 4 మధ్య జాట్ ఒక్కొక్కటిగా రూ. 5 లక్షల చొప్పున వేర్వేరు లావాదేవీలు చేశాడు. మొత్తం 15 లక్షలను వినియోగించుకున్నాడని బ్యాంక్ మేనేజర్ జితేంద్ర ఠాకూర్ వెల్లడించారు.
Read Also: Team India: బీజీటీలో అతను ఆడకపోయి ఉంటే మేము గెలిచే వాళ్లం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
అయితే, తప్పు జరిగిన పదిరోజుల తర్వాత అంటే జనవరి 10న బ్యాంక్ యాజమాన్యం తాము చేసిన తప్పును గుర్తించింది. ఈలోపే రైతు ఖర్చు చేశాడు. దీంతో బ్యాంక్ తమ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరితే, అతను ఇచ్చేందుకు నిరాకరించాడని ఠాకూర్ తెలిపారు. తన రుణాన్ని చెల్లించడానికి డబ్బును వినియోగించుకున్నట్లు రైతు తెలిపారు.
ప్రస్తుతం ఈ డబ్బుని తిరిగి పొందేందుకు బ్యాంక్ చట్టపరమైన మార్గాలనున అణ్వేషిస్తోంది. కనారామ్ జాట్ కిసాన్ క్రెడిట్ కార్డ్, 10 ఎకరాల భూమి పత్రాలు బ్యాంక్ వద్ద ఉన్నాయని ఠాకూర్ చెప్పారు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే, అతడి భూమిని వేలం వేయడం ద్వారా రూ. 16 లక్షలు తిరిగి పొందాల్సి వస్తుందని చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి రాం స్వరూప్ జాట్ చెప్పారు.