NIA Raids: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన నెల రోజుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ గ్యాంగ్స్టర్లపై దాడులు చేసింది. ఉగ్రవాద గ్రూపులతో లింకు ఉన్న గ్యాంగ్స్టర్లపై దాడులు చేస్తోంది. ఉత్తర భారతదేశంలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న ప్రదేశాల్లో దాడులు జరిగాయి. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పాటు జగ్గు భగవాన్‌పురియా హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో స్థానిక పోలీసు బలగాల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని ఉగ్రవాద కేసుల దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, టెర్రరిస్టుల మధ్య బంధం ఉన్నట్లు తేలడంతో ఈ గ్యాంగ్స్టర్లు యాంటీ టెర్రర్ ఏజెన్సీ రాడార్పైకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ సహా కొందరు గ్యాంగ్స్టర్లు కూడా జైళ్ల నుంచే పనిచేస్తున్నారని వారు తెలిపారు.ఈ గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా నిఘా-నేతృత్వంలో సమన్వయంతో కూడిన కార్యకలాపాలు నిర్వహించాలని, వారి అంతర్జాతీయ సంబంధాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏను కోరిందని పలు వర్గాలు చెబుతున్నాయి.
Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, నీరజ్ బవానా గ్యాంగ్‌లకు చెందిన 10 మందిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులను ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన నిందితులకు, ఉగ్ర గ్రూపులకు మధ్య బలమైన సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఇంతకు ముందే వెల్లడించారు. వీరి బంధాన్ని ఐఎస్ఐ ఉపయోగించుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా జైళ్లలో ఉండి కార్యకలాపాలు సాగిస్తోన్న వారిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్ఐఏ గురిలో గోల్డీ బ్రార్ కూడా ఉన్నాడు. నీరజ్ బవానా, అతడి గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతోన్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నీరజ్ గ్యాంగ్‌కు, లారెన్స్ బిష్ణోయ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉన్న గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయడానికి ఈ దాడులు నిర్వహించబడ్డాయి. సీమాంతర ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొన్న వారిపై కూడా దాడులు జరిగాయి.
సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఉగ్రవాదులు, పంజాబ్‌కు చెందిన గ్యాంగ్స్టర్ల మధ్య పెరుగుతున్న అనుబంధం దృష్టికి వచ్చింది. రాష్ట్ర ఆధారిత గ్యాంగ్స్టర్ల నెట్‌వర్క్‌పై గత రెండు నెలలుగా కేంద్రం పంజాబ్ పోలీసులకు పలు హెచ్చరికలు పంపిందని అధికారులు తెలిపారు. జూన్ 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామం సమీపంలో గాయకుడు తన వాహనంలో కాల్చి చంపబడ్డాడు.