కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశిస్తూ ‘‘పిక్‌పాకెట్స్’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఆయన ప్రకటన తప్పుగా ఉందని, 8 వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్‌లతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నవంబర్ 23న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు జారీ చేసి, నవంబర్ 26న సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ చర్యలకు ఆదేశించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదాన్ని కోర్టు పేర్కొనలేదు.
Read Also: Assembly Meeting: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ
గత నెల, నవంబర్ 23న ప్రధాని మోడీపై ‘పనౌటీ, జేబుదొంగ’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. రాజకీయ ప్రత్యర్థులపై ధృవీకరించని ఆరోపణలు చేయడానికి నాయకులకు అనుమతి లేదని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ. 14,00,000 కోట్ల రుణమాఫీ చేసిందని గాంధీ చేసిన ఆరోపణ, వాస్తవాలు కాదని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను ‘పిక్ పాకెట్స్’ అని పిలిచినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలాంటి ప్రసంగాలను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేని కోర్టు వ్యాఖ్యానించింది.