Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది. మేము ప్రేమను పంచడానికి మరియు ఏకం చేయడానికి కృషి చేస్తున్నాము. ప్రతిపక్షాలు ఈరోజు ఇక్కడికి వచ్చాయి, కలిసి బీజేపీని ఓడిస్తాం అని ఆయన అన్నారు. భారతదేశంలో భావజాల యుద్ధం నడుస్తోందని.. ఒక వైపు కాంగ్రెస్ ‘భారత్ జోడో’ సిద్ధాంతం.. మరోవైపు ఆర్ఎస్ఎస్, బీజేపీల గురించి ‘భారత్ తోడో’ సిద్ధాంత ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్ రాష్ట్రంలో ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇకవేళ బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భారతదేశాన్ని కలిపి ఉంచేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 15కు పైగా విపక్షాలు పాట్నాలో సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీయేతర విపక్షాలు అన్ని ఈ సమావేశానికి హాజరయ్యాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, హేమంత్ సొరెన్ హాజరయ్యారు. వీరితో పాటు కీలక నేతలు అఖిలేష్ యాదవ్, మహబూబా ముఫ్తీ, శరద్ పవార్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మొదలైన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.