నేషనల్ హెరాల్డ్ కేసులో నాలుగో విడత విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రనిరసనల మధ్య రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వరకు మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో సారి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ విజ్ఞప్తి మేరకు ఈడీ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు రాహుల్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్ సంబంధిత సమస్యలతో దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్, ఆయన సోదరి ప్రియాంకగాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ జూన్ 17 నుంచి జూన్ 20 వరకు తన ప్రశ్నలను వాయిదా వేయాలని రాహుల్‌గాంధీ చేసిన అభ్యర్థనను ఈడీ ఆమోదించింది.
మరోవైపు అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టనుంది. అగ్నిపథ్‌కు , రాహుల్ గాంధీని లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుత నిరసనలు కొనసాగిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ సాయంత్రం రాష్ట్రపతిని కూడా కలవనుంది
ఇదీ కేసు..: నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు.