నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయనను అధికారులు 40 గంటలకు పైగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇవాళ ఐదోరోజు మరోసారి రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. నేటితో ఆయన విచారణ ముగియనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోనియా గాందీ కూడా ఈ కేసులో ఈ నెల 23న ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
సోనియాగాంధీ ఇప్పటికే ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. కరోనా సోకడం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరడం వంటి కారణాలతో హాజరు కాలేదు. మరోవైపు రాహుల్‌గాంధీని ఈడీ వేధిస్తోందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆయనను గంటలకొద్దీ విచారిస్తూ రాజకీయ కక్షను సాధిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియన్, ఏజేఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి.
విచారణ సమయంలో హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణిపై కొన్ని కీలక ప్రశ్నలను ఈడీ సంధించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసోసియేటెడ్ జర్నల్, యంగ్ ఇండియా లిమిటెడ్ బోర్డు సమావేశాల గురించి ప్రశ్నించనున్నట్లు సమాచారం.