Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో ముగిసిన తర్వాతి రోజే అమృత్ పాల్ సింగ్ పై చర్యలు తీసుకోవడానికి పంజాబ్ గవర్నమెంట్ సిద్ధం అయింది.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్దూ ప్రారంభించిన సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’కు ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయనను అరెస్ట్ చేసేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది జలంధర్‌లోని షాకోట్‌లోని మెహత్‌పూర్ గ్రామంలో అతనిని చుట్టుముట్టారు. అమృతపాల్ సింగ్ పర్యటనకు సంబంధించిన ముందస్తు సమాచారం ఉన్నందున పోలీసులు షాకోట్‌లో అన్ని రహదారులను మూసివేసి భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Read Also: Harrasment : నాకు ప్రమోషన్ కావాలి.. నువ్వు మా బాస్ పక్కలో పడుకోవాలి
గత నెలలో అమృత్ పాల్ సింగ్ మద్దతుదారుడు లవ్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అమృత్ పాల్ సింగ్ నేతృత్వంలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులు, ఎస్పీపై దాడి చేశారు. లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల చేసేదాకా అక్కడే మరణాయుధాలు పట్టుకుని హడావుడి చేశారు. ఈ దాడి దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఖలిస్తానీ మూమెంట్ ను ప్రారంభించే పలువురిని అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ.. ఖలిస్తాన్ కోసం ఆయుధాలు చేపట్టడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడని అన్నాడు.
అజ్నాలా ఘటనపై పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాలనను డిమాండ్ చేసింది, మరియు పంజాబ్ కాంగ్రెస్ పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు అమృతపాల్ సింగ్ మరియు అతని మద్దతుదారులను అరెస్టు చేయాలని కోరింది. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయని బీజేపీ ఆరోపిస్తోంది.