Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్‌లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్‌కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై ఛార్జీషీట్ నమోదైంది. ఈ కేసులో గత అక్టోబర్ నెలలో ఢిల్లీ కోర్టు లాలూకి బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం లాలూ పార్టీ ఆర్జేడీ, నితిష్ కుమార్ జేడీయూతో కలిసి బీహార్‌లో అధికారంలో ఉంది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లాలూ కుటుంబానికి ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. ఇండియా కూటమిలో ఆర్జేడీ కీలక భాగస్వామిగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ముందు బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి తమను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Read Also: Big Shock: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ ఏమిటి..?
2004-2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. రైల్వేలో తమకు అనుకూలమైన వ్యక్తులను రైల్వేలో నియమించాయని ఆరోపణలు ఉన్నాయి. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్‌లో ఉన్న వివిధ జోనల్ రైల్వేలో బీహార్‌కి చెందిన వారిని నియమించారు.
అయితే ఇలా నియమించడానికి లాలూ కుటుంబంలోని పలువురికి అభ్యర్థుల చాలా తక్కువ ధరకు భూమిని అమ్మారని, మార్కెట్ రేటులో పోలిస్తే కేవలం ఐదోవంతు ధరకే భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా భూములు ఇచ్చి, జాబులు తెచ్చుకున్నట్లు, దీనిలో లాలూ కుటుంబ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర సంస్థలు ఆరోపిస్తున్నాయి.