కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా-స్నేహితురాలు అవివా బేగ్‌కు సంబంధించిన నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని రణథంబోర్‌లోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైహాన్ వాద్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వేను దాటుకుని..!
ఈ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పంచుకున్నాయి. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. జంట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. రైహాన్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా.. అవివా బేగ్ పసుపు రంగు సూట్ ధరించి కనిపించారు. ఇక నిశ్చితార్థ వేడుకలో కూడా సాంప్రదాయ భారతీయ దుస్తులనే ధరించారు. రైహాన్ ముదురు రంగు షేర్వానీ ధరించగా.. అవివా బేగ్ ప్రత్యేకమైన చీరలో కనిపించారు.

ఒక ఫొటోలో కొత్త జంటతో అవివా తల్లి నందితా బేగ్, తండ్రి ఇమ్రాన్ బేగ్, సోదరుడు రియాన్ బేగ్‌లు ఉన్నారు. ఇంకొక ఫొటోలో రాబర్ట్ వాద్రా-ఇమ్రాన్ బేగ్ కనిపించారు. రైహాన్ వాద్రా-అవివా బేగ్ ఏడేళ్ల నుంచి స్నేహం నడుస్తోంది. ఇటీవల కాలంలో రైహాన్ వాద్రా పెళ్లి ప్రపోజ్ చేయగా.. వెంటనే అవివా బేగ్ అంగీకరించింది. త్వరలోనే వివాహం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవివా బేగ్ ఢిల్లీలోనే నివాసం ఉంటుంది. తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త. తల్లి నందితా బేగ్ ఇంటీరియల్ డిజైనర్. నిందిత-ప్రియాంకాగాంధీ మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. ఆ కారణంతోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్‌లో నిందిత పనిచేశారు.
అవివా ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదువుకుంది. అనంతరం OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. అవివా కూడా ఇంటీరియర్ డిజైనర్, ఫోటోగ్రాఫర్, నిర్మాత కూడా. ఇక రైహాన్ వాద్రా.. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నారు. తాత రాజీవ్ గాంధీ, మామ రాహుల్ గాంధీ కూడా అదే స్కూల్‌లో చదివారు. అనంతరం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో ఉన్నత విద్యను అభ్యసించారు. వృత్తిరీత్యా రైహాన్ దృశ్య కళాకారుడు.