Prime Minister Narendra Modi’s high-level meeting on Covid: కోవిడ్-19 మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనావ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తుండటంతో ఇండియా కూడా అప్రమత్తం అయింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిపుణులతో, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్ పరిణామాలపై అత్యున్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రద్దీ ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని.. పరీక్షలను పెంచాలని అధికారులకు నిర్దేశించారు. వయసు పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లతో సహా పలు ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలను పెంచాలని కోరారు. కోవిడ్ కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు పీఎం సూచించారు. అధికారులు దేశంలోని మందులు, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో బెడ్ లకు సంబంధించిన అన్ని వివరాలను అధించారు. అవసరమైన ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు.
Read Also: Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్‌తో మూడుముళ్ళు..
జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించి, కోవిడ్‌కు సంబంధించిన పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు; ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, నీతి ఆయోగ్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే దేశంలో బీఎఫ్-7 వేరియంట్ నాలుగు కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చైనా పరిణామాల దృష్ట్యా కేంద్రం విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ర్యాండమ్ గా కరోనా పరీక్షలు చేయనుంది. మరోవైపు పలు రాష్ట్రాలు కూడా కరోనాపై అప్రమత్తం అయ్యాయి. కేరళ, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు పౌరులకు సూచనలు జారీ చేశాయి.