మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది. అంతేకాకుండా అల్లర్ల తర్వాత తొలిసారి సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ కూడా మణిపూర్ వెళ్లొచ్చారు. పరిస్థితులు సద్దుమణగడం.. పైగా 2027 వరకు ప్రభుత్వం కొనసాగింపునకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్ బీజేపీ నేతలు అధిష్టానంతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!
ఇంఫాల్ లోయకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి. రాబిండ్రో, సపమ్ రంజన్, హెచ్. డింగో సింగ్‌తో పాటు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్, బీజేపీ ఈశాన్య సమన్వయకర్త సంబిత్ పాత్రా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ కోరారు. సోమవారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అందుకు అధిష్టానం కూడా సంసిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ వారం గానీ.. వచ్చే వారం గానీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రితో సమావేశం తర్వాత తుది నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక బీజేపీ సీనియర్ నేత మీడియాకు తెలియజేశాడు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో అధికారంలోకి రావచ్చని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి