బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తప్పేనని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓ జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తన తప్పిదమే కావచ్చని పేర్కొన్నారు. గతంలోకి తొంగి చూస్తే పోటీ చేయకపోవడం పొరపాటు జరిగినట్లుగానే అనిపిస్తోందని తెలిపారు. ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో రూ.10,000 వేయడంతోనే జేడీయూకు 85 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. వాస్తవంగా అయితే 25 సీట్లు కంటే ఎక్కువ గెలవకపోయేది.. కానీ 10 వేలు ఇవ్వడంతో ఎక్కువ సీట్లు పొందగలిగిందని చెప్పుకొచ్చారు.
మంగళవారం ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారంటే..
మా ఆలోచనల్లో ఏదో తప్పు జరిగి ఉంటుందని.. ఓటమి పూర్తి బాధ్యత తనదేనన్నారు. 100 శాతం ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు చెప్పారు. బీహార్ రాజకీయాలను మారుద్దామని కొత్త పాత్ర పోషించామని.. కానీ ప్రజలు తమను కోరుకోలేదన్నారు. మా ఆలోచనల్లో ఎక్కడో.. ఏదో జరిగి ఉంటుందని అనుకుంటున్నట్లు వాపోయారు. చాలా నిజాయితీగా ప్రయత్నించామని… కానీ అది పూర్తిగా విఫలమైందని చెప్పారు. దీన్ని అంగీకరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.
గత మూడేళ్లుగా ఎంతగా పని చేశానో అందరికీ తెలిసిందేనని.. తన శక్తినంతా ధారపోసినట్లు చెప్పుకొచ్చారు. అయినా వెనక్కి తగ్గే ప్రశ్నేలేదన్నారు. బీహార్‌ను మెరుగుపరచాలనే తన సంకల్పం నెరవరే వరకు ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.
బీహార్ ప్రజలు ఏ ఆధారంగా ఓటు వేయాలి.. కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమో వివరించి చెప్పడంలో తాను విఫలమైనట్లు ఒప్పుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈనెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒక్కరోజు మౌన ఉపవాసం ఉండబోతున్నట్లు ప్రకటించారు. తప్పులు చేసి ఉండొచ్చు.. కానీ ఎలాంటి నేరం చేయలేదన్నారు. సమాజంలో కుల ఆధారిత ద్వేషాన్ని వ్యాప్తి చేసే నేరం చేయలేదని వివరించారు. ఎక్కడా కూడా హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదని పేర్కొ్న్నారు. మతం పేరుతో ప్రజలను విభజించే నేరం చేయలేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని పేద, అమాయక ప్రజలకు డబ్బు ఇచ్చి ఓట్లు కొనే నేరం ఏ మాత్రం చేయలేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. ఇలా సునామీ సృష్టించడం ఇది రెండోసారి. 2010లో కూడా 206 సీట్లు గెలుచుకున్నారు. ఇక బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, HAMS 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 గెలుచుకున్నాయి. ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి. జన్ సురాజ్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది.