Prajwal Revanna: సెక్స్ వీడియోల స్కాండల్‌లో ఇరుక్కున్న జేడీయూ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం భారత్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విమానాశ్రయంలోనే అతడిని అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూర్ కోర్టుని ఆశ్రయించారు. బుధవారం ఆయన కోర్టు ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఈ పరిణామాల తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి జర్మనీకి వెళ్లాడు. ఇప్పటికే అతడిపై కర్ణాటక ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు అతని దౌత్యపరమైన పాస్‌పోర్టు రద్దు కోసం కేంద్ర కూడా చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ నెల 31న శుక్రవారం జర్మనీ నుంచి భారత్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?
మే 31న తాను భారత్‌కు తిరిగి వస్తానని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు విచారణలో పాల్గొంటానని ప్రజ్వల్ రేవణ్ణ సోమవారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బెంగళూర్ ఎయిర్ పోర్టు చేరుకున్న వెంటనే ప్రజ్వల్‌ని అరెస్ట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. విమానాశ్రయానికి రాగానే అరెస్ట్ చేస్తామని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈరోజు చెప్పారు. అధికార వర్గాల ప్రకారం.. ప్రజ్వల్ మే 30న మ్యూనిచ్ నుంచి బెంగళూర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. మే 31 తెల్లవారుజామున ఇండియాలో ల్యాండ్ కానున్నాడు.
హసన్ ఎంపీ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరుపున పోటీ చేసిన ప్రజ్వల్ సెక్స్ కుంభకోణంలో ఇరుకున్నాడు. ఇతనికి సంబంధించిన 3000 వరకు వీడియోల పెన్ డ్రైవ్ దొరికింది. ఇందులోని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణాన్ని విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.