Rahul Gandhi: కేంద్రం ఎన్నికల సంఘంపై శుక్రవారం రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ‘‘ఎన్నికల దొంగతనానికి’’ ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. అయితే, ఈసీ నిర్ణయాన్ని పలు పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
భువనేశ్వర్‌లో జరిగిన సంవిధాన్ బచావో సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈసీ “బీజేపీ విభాగంగా” పనిచేస్తోందని, మహారాష్ట్రలో జరిగినట్లుగా బీహార్‌లో “ఎన్నికలను దొంగిలించడానికి” ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని, మహారాష్ట్రలో జరిగినట్లే బీహార్‌లో ఎన్నికల ఫలితాలను మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం తన విధులను సరిగా నిర్వర్తించడం లేదని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1 కోటి మంది కొత్త ఓటర్లను జోడించారని, ఈ ఓటర్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదని, ఓటర్ల జాబితాను, వీడియోగ్రఫీని అందించాలని ఈసీని మేము కోరినప్పటికీ, ఈసీ అలా చేయలేదు అని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలమంతా కలిసి ఈసీ, బీజేపీ ఎన్నికల చోరీని అడ్డుకుంటామని అన్నారు.