US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..

  • ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
  • భారత్‌లో అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు..
Pm Modi (1)

Pm Modi (1)

US Ambassador: భారత ప్రధాని నరేంద్రమోడీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే నేతల్లో మోడీ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో బలపడుతున్నాయని చెప్పారు. డిసెంబర్‌లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశం ఉందని, ఆయన ఈ సమావేశానికే పరిమితం కాదని, మోడీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ట్రంప్ మోడీని తన స్నేహితుడిగా భావిస్తారని అన్నారు.

ట్రంప్ వచ్చే ఏడాది భారత్‌కు మరోసారి వచ్చే అవకాశం ఉందని గోర్ సంకేతాలు ఇచ్చారు. తాను ట్రంప్‌తో మాట్లాడిన ప్రతీసారి 2020 భారత పర్యటన, మోడీని గుర్తుచేసుకుంటారని అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నాయని చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడం అమెరికాకు మంచిదే అని గోర్ అన్నారు. దేశంలో స్థిరత్వం ఉండటం వల్ల భారత్ అమెరికాకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుతోందని చెప్పారు. భారత దేశానికి మోడీ స్థిరత్వాన్ని అందిస్తున్నారని గోర్ అన్నారు.

భారత్ అమెరికాకు విశ్వసనీయమైన రక్షణ భాగస్వామి అని, ఇరు దేశాల రక్షణ సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలు, విక్రయాలకు మాత్రమే పరిమితం కాలేదని, అమెరికా ప్రపంచంలోని ప్రతీ దేశానికి ఆయుధాలను విక్రయించదని, అమెరికా విశ్వసించే దేశాల్లో భారత్ కూడా ఉందని చెప్పారు. జావెలిన్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్ల సరఫరాలను ఆయన ఉదాహరణలుగా చూపారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌లో మరోసారి భారత పర్యటనకు రానున్నారని గోర్ వెల్లడించారు. రూబియో భారత పర్యటనకు వచ్చిన కొన్ని నెలలకే మళ్లీ రావడం చాలా అరుదుగా ఆయన చెప్పారు. అమెరికా క్యాబినెట్ మంత్రుల పర్యటనలు కూడా ప్లాన్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలోని మూడు పెద్ద రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు రానున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలు, జీ20 సమావేశాలతో పాటు వచ్చే నాలుగు నెలల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మూడు సార్లు అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.