PM Modi Is The Soul Of India Says Maharashtra Minister Suresh Khade : ప్రధాని నరేంద్రమోదీ మన భారతదేశానికి ఆత్మ లాంటి వారని, ఆయన ఎప్పటికీ ఓడిపోడు అంటూ మహారాష్ట్ర మంత్రి సురేశ్ ఖాడే వ్యాఖ్యానించారు. మోదీ అత్యంత శక్తివంతమైన నాయకుడని కొనియాడారు. ఆనాటి ప్రధానమంత్రులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇందిరా గాంధీ సైతం ఓటములు చవిచూశారని.. కానీ మోదీ ఎప్పటికీ ఓడిపోరని అన్నారు. చివరికి భారతీయ జనతా పార్టీ అధిపతి అయిన ఎల్కే అద్వానీ సైతం ఎన్నికల్లో ఓడారని చెప్పారు. కానీ, ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే.. 1977 నుంచి 2014 వరకు అద్వానీ ప్రతి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.
అయినా.. మంత్రి సురేశ్ ఖాడే ఉన్నట్టుండి మోదీపై ఇంతలా ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలే! బారామతి ప్రాంతంలో శరద్ పవార్, ఆయన బంధువుని ఓడించడం అసాధ్యమని ఆయన ముంబైకి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంధార్పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాక సూర్యుడు ఉదయించొచ్చేమో గానీ.. బారామతి గడ్డపై పవార్స్‌కు రాజకీయ ఓటమి అనేది ఉండదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే.. మోదీ బారతదేశానికి ఆత్మ అని, ఆయన ఏ ఎన్నికల్లోనూ ఓడిపోడని సురేశ్ ఖాడే అన్నారు. ఇతరుల మాదిరిగానే ప్రజల ఓట్ల దయతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్తే.. ఆయన ప్రజల మనసుల్లో ఉన్నారని ఆ మంత్రి బదులిచ్చారు.
కాగా.. ఇందిరా గాంధీ 1977లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1955లో బైపోల్‌లో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో రెండు సీట్లలో పోటీ చేయగా, ఒక స్థానంలో పరాజయం పొందారు. అనంతరం 1962, 1984 ఆయన ఓటమి చవిచూశారు.