జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ రాష్ట్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపుల నిల్చొని ఘనస్వాగతం పలకగా.. అందరికీ అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. జార్ఖండ్‌లో ఆయన రూ.16,800కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్తగా 657 ఎకరాల విస్తీర్ణంలో రూ.401కోట్లతో నిర్మించిన ధియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. నూతన ఎయిర్‌పోర్టులో ధియోఘర్ నుంచి కోల్‌కతాకు ఇండిగో విమాన సర్వీస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. మే 25, 2018న డియోఘర్ బాబా బైద్యనాథ్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో పాటు పర్యాటకం, వాణిజ్య అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని అన్నారు. పక్క రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయన్నారు. ఈ విమానాశ్రయం కోల్‌కతా, పాట్నా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు విమాన సర్వీసులను అందించడంతోపాటు వేగవంతమైన కనెక్టవిటీని అందిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
KCR: కేసీఆర్ చెప్పినా పట్టించుకోరా?
2010లో తన మదిలో మెదిలిన ఈ ఎయిర్‌పోర్టు కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఈ ప్రాజెక్టు తమకు గర్వకారణమన్నారు.బాబా బైద్యనాథ్ ధామ్‌కి నేరుగా కనెక్టివిటీని వేగవంతం చేయడానికి రూ.401 కోట్లతో విమానాశ్రయం ప్రారంభించబడిందన్నారు. ఇది దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బాబా బైద్యనాథ్ ధామ్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.