PM Modi: జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ గౌరవ అతిథిగా హాజరుకాబోతున్నారు. పారిస్‌లోని చాంప్స్ ఎలిసీస్‌లో జరిగే బాస్టిల్ డే ఫ్లైపాస్ట్‌లో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధవిమానాలు పాల్గొనున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అంతకుముందు, మాక్రాన్ ట్వీట్ చేస్తూ, ‘‘ప్రియమైన నరేంద్ర, గౌరవ అతిథిగా జూలై 14 పరేడ్ కి పారిస్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: AR.Rahaman: ఏఆర్ రెహమాన్ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?
జూలై 14న బాస్టిల్ డే సందర్భంగా ఫ్రెంచ్ సంప్రదాయ సైనిక కవాతు పారిస్‌లో జరుగుతుంది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలపడనుంది. ఈవెంట్ ఫ్లైపాస్ట్‌లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాలను మోహరించనున్నట్లు అంతకుముందు భారత రక్షణ అధికారులు ధృవీకరించారు. బాస్టిల్ డే రోజున జరిగే కవాతులో భారత సైనిక బృందం కూడా భాగం అవుతుంది.
గత వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించారు. అమెరికా స్టేట్ విజిట్ లో ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం బ్రహ్మరథం పట్టింది. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ప్రెసిడెంట్ జో బైడెన్, ఆయన సతీమణి, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు వైట్ హౌజ్ విందులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వివిధ ఒప్పందాలు జరిగాయి. ఆ తరువాత ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు ప్రభుత్వం ప్రధానికి అత్యున్నత పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ని ప్రదానం చేశారు.