Best PM: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ అన్ని లోక్‌సభ స్థానాల్లోని 35,801 మంది ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఈ సర్వే ఆధారపడింది. డిసెంబర్ 15, 2023- జనవరి 28, 2024 మధ్య సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో ఇప్పటి వరకు భారత దేశ ప్రధానుల్లో అత్యుత్తమ ప్రధానిగా ప్రజలు నరేంద్రమోడీకి ఓటేశారు. 44 శాతం మంది ఆయనకే మద్దతు తెలిపారు. 15 శాతం మంది అటల్ బిహారీ వాజ్‌పేయికి, 14 శాతం మంది కాంగ్రెస్ నేత, దివంగత ప్రధాని ఇందిరాగాంధీని అత్యుత్తమ ప్రధానిగా పరిగణించారు. అయితే, 11 శాతం మంది మన్మోహన్ సింగ్‌ని ఎంచుకున్నారు.
నరేంద్రమోడీ పాలనలో ఏది ఎక్కువగా గుర్తుండిపోతుందనే దానికి.. సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది అయోధ్య రామమందిరమని పేర్కొన్నారు. 19 శాతం మంది భారత ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచారని, 12 శాతం మంది కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు మోడీ ప్రభుత్వానికి సానుకూల అంశాలని చెప్పారు. 9 శాతం మంది పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్, 6 శాతం నోట్ల రద్దు, 6 శాతం కోవిడ్ మేనేజ్మెంట్, 5 శాతం అవినీతి వ్యతిరేక పోరాటానికి ఘనత వహించారని స్పందించారు.