Bengal Violence: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ నిరసనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, అనేక మంది త్రీవంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మత, రాజకీయ హింసపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలన్నారు.. ఇక, రిట్ పిటిషన్‌లో బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. దీంతో పాటు బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని కూడా ఆ పిటిషనర్ లాయర్ శశాంక్ కోరారు.
Read Also: AlluArjun : మార్క్ శంకర్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..
కాగా, బెంగాల్ రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా చెలరేగిన అల్లర్లపై సుప్రీంకోర్టు తక్షణ దృష్టి సారించాలని పిటిషనర్ కోరారు. ఈ అల్లర్లు ప్రజలకు సంబంధించిన పెద్ద ఎత్తున దాడులు, మరణాలు, ఆస్తుల ధ్వంసం కావడంతో పాటు హిందువుల మతపరమైన కట్టడాలు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 19 (వాక్ మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ), ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 25 (స్వేచ్ఛ- మతాన్ని ప్రచారం చేసే హక్కు) ను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ సహా ఇతర ప్రభావిత ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రజల ప్రాణాలను కాపాడటానికి కోర్టు తక్షణ చర్యలు చేపట్టాలని న్యాయవాది శశాంక్ ఝా వేడుకున్నారు.