దేశవ్యాప్తంగా RRR సినిమా ప్రభంజనం నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.750 కోట్లు వసూలు చేసినట్లు తాను తెలుసుకున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని.. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో భారత్ 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందన్నారు. అంతేకాకుండా RRR సినిమా లాగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను టార్గెట్ పెట్టుకోగా.. దానిని మార్చి 23న అధిగమించామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి సరుకుల ఎగుమతులు 292 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాల అధిక షిప్‌మెంట్‌ల నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
కాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల పట్ల RRR టీమ్ ధన్యవాదాలు తెలిపింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది.
https://ntvtelugu.com/ram-charan-gives-surprise-gift-for-rrr-movie-team-members/