Pit Bull Dog Attacked A 12 Year Boy In Hubli: కర్ణాటకలోని హుబ్లీలో పిట్‌బుల్ జాతికి చెందిన ఓ కుక్క వీరంగం సృష్టించింది. ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఒకవేళ ఆ కుక్క నుంచి విడిపించకపోయి ఉంటే, ఆ కుక్క ఆ బాలుడి ప్రాణాలు తీసేది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీ బంకాపుర చౌక్ వద్ద పాటిల్ గల్లీలో పవన్ అనిల్ దొడ్డమని (12) అనే బాలుడు ట్యూషన్‌కి వెళ్తున్నాడు. అదే సమయంలో.. గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన పిట్‌బుల్ కుక్క కాంపౌండ్ వాల్ ఎగిరి, రోడ్డు మీదకు వచ్చింది. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు.. ఆ కుక్క నుంచి బాలుడ్ని కాపాడారు. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇంతలోనే ఆ కుక్క యజమాని గురుసిద్దప్ప చెన్నోజీ తన కుక్కని తీసుకొని, కుటుంబం సహా ఇల్లు విడిచి పారిపోయాడు. అతడు ఒక మాజీ కార్పొరేటర్ బంధువు అని తెలియడంతో.. ఆ లింక్ ద్వారా అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. పిట్‌బుల్ జాతి కుక్కలు ఉద్రేకమైనవి. ఏం చేయకుండానే అవి జనం మీద పడి కరుస్తాయి. అందుకే, భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినప్పటికీ.. కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకుంటున్నారు. చెన్నోజీ కూడా ఆ కోవకు చెందినవాడే. దీంతో, తనకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయంతో, ఆ ఘటన చోటు చేసుకున్న వెంటనే అతడు కంటికి కనిపించకుండా, కుటుంబం సహా పరారయ్యాడు. ఈ కుక్కల్ని ఇంతకుముందు అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. కానీ, భారత ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుంచి దిగుమతి ఆపేశారు.
ఇదిలావుండగా.. హుబ్లీ, ధార్వాడ జంట నగరాలలో కుక్కల బెడద ఎక్కువ అయ్యిందని ఫిర్యాదులు అందుతున్నాయి. అక్కడి కిమ్స్ ఆసుపత్రల్లో కుక్క కాటుతో చేరుతున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం ఐదారు మందికి పైగా కుక్కల బారినపడి కిమ్స్‌లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కుక్కల నియంత్రణకు తాము చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీధర్ దండెప్పనవర చెప్పారు. ఆల్రెడీ టెండర్లు పిలిచామని.. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కుక్కలకు సంతాన రహిత ఆపరేషన్లను చేస్తామని చెప్పారు.