Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Read Also: UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసి, మూడు రోజులు సభకు హాజరు కావాలని ఆదేశించింది. సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ సోమవారం చర్చకు ప్రతిపక్ష పార్టీల తరుఫున చర్చను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రోజు లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగనుండగా, రేపు రాజ్యసభలో చర్చించనున్నారు. రెండు సభల్లో కలిపి చర్చ కోసం 16 గంటలు కేటాయించారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ జరిగినప్పటి నుంచి, కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంపై విమర్శిస్తోంది. మోడీ ప్రభుత్వం ట్రంప్‌కి తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకుందని విమర్శిస్తోంది. ఇదే కాకుండా, ఘర్షణ సమయంలో భారత్ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది.
