నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్ పదవీకాలం ఈనెల 30వ తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అమితాబ్ కాంత్ 17 ఫిబ్రవరి 2016 న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రారంభంలో అతని పదవీకాలం 2 సంవత్సరాలు. ఆ తర్వాత అతని సర్వీస్‌ను చాలాసార్లు పొడిగించారు. రెండేళ్ల పాటు పరమేశ్వరన్ ఈ పదవిలో ఉండనున్నారు. 981 బ్యాచ్ యూపీ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పరమేశ్వరన్ అయ్యర్.. ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈ రంగంలో నిపుణుడిగా గుర్తింపు పొందాడు. అతను ఈ రంగంలో నిపుణుడిగా ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశాడు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిర్వహణ బాధ్యతలను ఈయనకు అప్పగించింది. దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో స్వచ్ఛంద పదవీ రమణ చేసి.. ప్రపంచబ్యాంకు చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓగా కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. 63 ఏళ్ల అయ్యర్ శ్రీనగర్‌లో జన్మించారు. డూన్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను అభ్యసించారు.