Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే దోహదపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించుకున్నారు. తాను వాణిజ్యంతో భయపెట్టడం వల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ప్రగల్భాలు పలికారు. అయితే, ఈ వాదనల్ని భారత్ మొదటి నుంచి ఖండిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సాక్షాత్తుగా పార్లమెంట్‌లో కాల్పుల విరమణలో ఏ దేశ జోక్యం లేదని స్పష్టం చేశారు.
Read Also: AP Free Bus Effect : “జనాల మధ్య మా ఊపిరి ఆగిపోయేలా ఉంది” కండక్టర్ కుసుమ కుమారి సెల్ఫీ వీడియో వైరల్!
ఇదిలా ఉంటే, తాజాగా ఇలాంటి ప్రకటనే పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సమస్యపై మూడో పక్షం మధ్యవర్తిత్వానికి భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని, కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను అడిగినట్లు వస్తున్న వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. ఇస్లామాబాద్, ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరినప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ, భారత్-పాక్ మధ్య సమస్యలు అన్ని ద్వైపాక్షికమే అని స్పష్టం చేశారని ఇషాక్ దార్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ అమెరికా ద్వారా వచ్చినప్పటికీ, భారత్ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, ఇది ద్వైపాక్షిక అంశమని భారత్ నొక్కి చెప్పిందని దార్ తెలిపారు.
‘‘ మూడో దేశం ప్రేమేయంపై మాకు అభ్యంతరం లేదు, కానీ భారత్ ఇది ద్వైపాక్షిక విషయం అని స్పష్టంగా చెబుతోంది. మేము ద్వైపాక్షికతకు అభ్యంతరం చెప్పము. కానీ చర్చలు సమగ్రంగా ఉండాలి. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు మేము ఇంతకుముందు చర్చించినవే’’ అని ఇషాక్ దార్ అన్నారు. భారత్ స్పందిస్తే చర్చల్లో పాల్గొనేందుకు పాక్ సిద్ధంగా ఉందని అన్నారు.